సంక్రాంతి
సూర్యుని మకర ప్రవేశముతో శిశిర ఋతువు ప్రారంభమగును. అతి చల్లని బలమైన వాయువు వీచుట, చెట్లు ఆకులు రాల్చుట ఈ ఋతువు యొక్క ముఖ్య లక్షణములు. ఆ వాయువు ప్రాణులయందు శ్లేష్మప్రకృతిని, పొడి శరీరమును పెంచును. శిశిరఋతువునుండి మూడవది వర్షఋతువు. కావున వాతావరణమును ముఖ్యముగ వాయువును శుద్ధపరచుటకు మరియు మేఘోత్పత్తికి అవసరమైన స్థితిని ఏర్పరచుటకు ప్రకృతిలో లభించు అన్ని పదార్ధములలోనూ అత్యంతశక్తివంతమైనది మరియు నానావిధప్రభావముగలది అయిన ఆవుపేడను ప్రయోగించుట అనాదిగా జరుగుతోంది. ఆవును మన సంస్కృతిలో ముఖ్యమైన స్థానమునిచ్చుటలో గల కారణములలో ఇది కూడ కారణము.
సూర్యకిరణములు భిన్న భిన్న కాలములందు భిన్న భిన్న ప్రభావములను కలిగి ఉండును. ఆ ప్రభావమునందు మార్పు సూర్యుని రాశిప్రవేశములతో ప్రారంభమగును. మన సంస్కృతినందు అన్ని రాశిప్రవేశములు లేక సంక్రాంతులు ప్రాధాన్యతను సంతరించుకొన్నవి. వసంత ఋతువునకు మరియు కొత్తసంవత్సరమునకు స్వాగతము పలుకునది, మానవజీవనాధారమైన పంటల సారము చేతికి అందే కాలమగుటవలన, ప్రకృతిలో కొత్త జీవమును మరియు సారమును నింపు శక్తి గలదగుటవలన మరియు అనేక వైజ్ఞానిక కారణములచేత ఈ సంక్రాంతి అనాదిగా ఆదరణను పొందియున్నది. పంటల దిగుబడి మరియు సర్వత్ర సమృద్ధి కారణముగా ఆనందోత్సాహములకు ఈ వేడుకలు చిహ్నములు.
ప్రకృతి తన స్వభావమును మార్చుకోకుండా మానవాళికి ఆనందోత్సాహములను అందిస్తూ ఉండాలని, పంటలకు ఆశ్రితములైన నదులు ఎల్లవేలలా జలయుతములై కళకళలాడాలని, వర్షములు సకాలములో పడి పంటలకు సహకరించాలని, ప్రకృతిసమతుల్యత దెబ్బ తినకుండా ఉండాలని, క్రమము తప్పకుండా మనమాచరించే ఈ వేడుకలు భూమిమీద పెరుగుతున్న వాతావరణసమస్యలనుండి మనను రక్షించాలని, మనను పెంచి పోషించే ప్రకృతి తల్లిని మనము కూడా ఈ పండుగలు మరియు వేడుకల వంకతో కాపాడుకొంటూ ఉండాలని ఆశిస్తూ .........
మీ అందరికీ మా హృదయపూర్వక భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు
రాబోవు వేడుకల సందర్భములో మరల ఒక కొత్త ఒరవడితో మరల కలుసుకుందాము