భోగి
మనము జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది భోగి పండుగ. మన సంస్కృతికి వెన్నుముక్క పండుగలు. ఇవి సరదాలు అనుకునే కన్నా మానవమనుగడకు అవసరమయ్యే వాతావరణమును ఈ భూమిపై పొందుపరచి ఉంచుటకు మనవారు ఆవిష్కరించిన అద్భుతమైన జీవనసరళి అనడం ఎంతైనా సబబు. నేటి విజ్ఞానము కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజులలో సంస్కృతిని ఆచార వ్యవహారములను కూడా ఆ విజ్ఞానదృష్టితో వీక్షించడము దాని గొప్పతనమును తెలుసుకొనడము చాలా అవసరమని మేము భావిస్తున్నాము. అందులో భాగముగ భోగిపండుగపై మా దృష్టికోణమును మీముందుంచుచున్నాము.
సంక్రమణమనగా సూర్యుని రాశి ప్రవేశము. మకరములో ప్రవేశించిన నాటినుండి సూర్యోదయము జరుగు తూర్పు ఉత్తరమునకు జరగడము ప్రారంభమవుతుంది. అనగ భూమధ్యరేఖాప్రాంతపు నాడీరేఖనుండి సూర్యుని దూరము దక్షిణదిశలో పెరగడము ఆగి ఆ సూర్యభ్రమణమార్గము ఉత్తరమువైపునకు జరుగుట ప్రారంభమవుతుంది. ఆ మకరసంక్రమణమునాడు సంక్రాంతి పంజుగ జరుపుకుంటాము. ఆ సంక్రాంతికి ముందురోజు జరుపుకునే వేడుకకే భోగి అని పేరు.
భోగి నాడు ముఖ్యముగా తలంచుపోసుకోవడము, ఆవు పిడకలతో చేసిన దండలను మంటలో వేయడము ఆనాదిగా ఆంధ్రదేశములో నడుస్తున్నది. అదే పంజాబు ప్రాంతమువారు కూడ మంట వేస్తారు గానీ భోగిదండల ఆచారము లేదు. వారు దీనిని లోరి అంటారు. బెంగాలు ప్రాంతమువారు ఆ మంటలలో నువ్వులు వేస్తారు. ఇప్పుడు మనము చేయు పనుల ప్రాశస్త్యమును తెలుసుకుందాము.
ఆనాదిగా వస్తున్న ఆచారము యజ్ఞములు చేయడము. ఆ యజ్ఞములు వానికి చెప్పబడిన సమయములందు మాత్రమే చెయ్యవలెను. అగ్నిలో వేసిన ద్రవ్యమును అగ్ని ఇంద్రాది దేవతలవరకూ చేరుస్తాడు. కాబట్టి అగ్నిని హవ్యవాహనుడు అంటాము. అనగ అగ్ని ఆ హవిస్సతును దేవతలకు చేరవేయువాడు మాత్రమే గానీ తను అనుభవించడని దాని అర్థము. ఆ ఇంద్రాదులు ఎవరు? వారికే రూపములో ఈ హవిస్సు చేరుతుంది? దానిని వానికి చెప్పిన సమయములోనే ఎందుకు చెయ్యాలి? ఇలా చాలా ప్రశ్నలు పుడతాయి.
- ఆ ఇంద్రాదులు ఎవరు?
ప్రకృతిలో మానవమనుగడకుపయోగించు విభిన్న తత్త్వములకే ఇంద్రుడు విష్ణువు మొదలగు పేరులను మనవారు ఏర్పరిచినారు. దీనిమీద విస్తృత చర్చ మనము భవిష్యత్తులో సందర్భానుసారము చేద్దాము.
- వారికే రూపములో హవిస్సు చేరుతుంది? దానివలన ప్రయోజనమేమిటి?
అగ్నిలో వేయబడిన ద్రవ్యములచే ఏర్పడిన ఆవిరి మరియు ధూమము చుట్టూ ఉన్న వాతావరణమును జేరుతుంది. అగ్ని కారణముగా పొందిన వేడివలన ఆ ధూమము తేలికై వాతావరణపు పరిధులకు చేరుతుంది. భూమిచుట్టూ వాయువు (వాతము) యొక్క ఆవరణము ఎంతవరకూ ఉన్నదో ఆ ధూమముకూడా అంతవరకే చేరగలదు. ఆ పరిధిని దాటలేదు. ఈ తేలికపాటి ఆవిరి మరియు ధూమము అచటి సామాన్య మరియు సారూప్య వాయువుతో కలిసి మేఘములుగ ఏర్పడును. మరియు ఆ ధూమమునందు మేఘములను వర్షింపజేయు శక్తి ఉన్నది. భగవద్గీతయందు యజ్ఞమువలన వర్షము, వర్షము వలన అన్నము కలుగునని చెప్పిన భగవద్వచనమునకు అర్థము ఇదియే!