చిన్నమాట

మన సంస్కృతీ సంప్రదాయములు రోమరోమమునా నేటికీ మనను అంటిపెట్టుకుని ఉన్నాయి. కానీ వేగముగా మారుతున్న జీవనశైలి మనను వాటినుండీ రోజరోజుకూ దూరము చేస్తోందన్న భావన కూడా మనలో పెరుగుతోంది. రోజుకు 24 గంటలు చాలని పరిస్థితి నేడు చాలా మందికి ఉన్నది.
ఆ విధముగా నిరుత్సాహపడేవారికి ఒక వినూత్నపద్ధతిలో తిథి నక్షత్రాదులను అందించడానికి పిడపర్తి పూర్ణయ్య విజ్ఞాన ట్రష్టు ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. ఆ దిశగా మొదటి అడుగే ఆన్ లైన్ లో విశ్వపంచాంగము.
ఈ విశ్వపంచాంగములో తిథి, నక్షత్ర, యోగ, సూర్యోదయ, దుర్ముహూర్తములు పొందు పరచబడినవి. మిగిలిన పంచాంగ భాగములను కూడా చేర్చు ప్రయత్నము శరవేగముతో నడచుచున్నది. ఈ భాగములో ప్రంపంచములోని ఏ ప్రాంతమునకు కావలెనన్న ఆ ప్రాంతమునకు తిథ్యాదులు చూసుకునే విధముగా ఏర్పాటు చేయ బడినది. అనగ ప్రతీ ప్రదేశముయొక్క స్థానిక కాలానుగుణముగా మనము ఇందు తిథ్యాదులను చూసుకోవచ్చును.
మనము ఒక ప్రాంతమునకు చేసిన పంచాంగమును వేరొక ప్రాంతములో వాడటానికి కొన్ని మార్పులు మరియు చేర్పులు చేసుకోవలసి ఉంటుంది. ఇది వివరముగా చెప్పిననూ అందరివలనా సాధ్యము కాదు. సమయాభావముచేత కొందరు, వేరు కారణములవలన మరికొందరు ఈ మార్పులను చేసుకోలేక పోతున్నారు. మార్పు చేసుకొనకపోతే ఆ సమయములో లేని తిథ్యాదులను వాడు ప్రమాదమున్నది.
అవిశ్రాంతముగా పనిచేయువారికి కూడా నేడు ఇంటర్నెట్ చాలా చేరువయినది. కావున ఏ ప్రాంతము వారైనా ఆ ప్రాంతముయొక్క పంచాంగమును చూచుకునే విధముగా ఈ పంచాంగము తయారుచేయబడినది. ఈ ప్రయత్నము ఇంటర్నెట్ లో పరిపూర్ణ ప్రతి ప్రదేశ పంచాంగమును ప్రవేశపెట్టు దిశలో మొదటి అడుగు కాగలదని భావిస్తున్నాము.
2006 డిశంబరులో విక్రమహాలులో(రాజమండ్రి) నిర్వహించిన జ్యోతిషకార్యశాలయందు ఈ పంచాంగప్రారంభమునకు సంబంధించి ప్రకటన చేసి యున్నాము. దీనిని మరింత ఉపయోగకరముగా తీర్చి దిద్దుటకు అవసరమయిన సలహాలను అందజేయవలసినదిగా కోరుకొనుచున్నాము.
పిడపర్తివారికి ఖగోళ వేత్తలుగా ప్రతిష్ఠనిచ్చిన తెలుగువారి మరియు అటువంటి పేరు తెచ్చిన మా పూర్వీకుల ఋణమును తీర్చుకొనే ప్రయత్నములో భాగముగా ఈ చిన్న ప్రయత్నము చేయుచున్నాము. మరియు ఖగోళవిజ్ఞానమునకు మరల మన ప్రాంతములో పూర్వవైభవమును తెచ్చుటకు, దానిని ఆధునిక విజ్ఞానముతో అనుసంధానించుట ద్వారా అందరికీ ఉపయోగపడేలా తీర్చి దిద్దడానికి కటి బద్ధులమై ఉన్నామని తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానములు ఎప్పటివలే కొనసాగగలవని ఆశిస్తూ...

మీ పిడపర్తి పూర్ణయ్య విజ్ఞాన ట్రష్టు